Friday, May 29, 2020

ఉషోదయ వెలుగు

వేకువ సడి..#

నులివెచ్చని వేకువసడిలో
మిణుకుమన్న తొలికిరణపు రెక్కలో
మంచు కురుస్తున్న మట్టివాసన
అనంత ప్రవాహమై
మదిలో తుళ్ళింతలు రేపుతుంది

కుసుమించు సుమాల తీపి రాగాలాపనలో
నీలిచెట్టు సుస్వర కొమ్మలసందుల్లో
ఝుమ్మని చెవులకి సోకిన సంకీర్తన
పిల్లగాలి కబురై
దివ్యసంచారానికి తీసుకుపోతుంది

గుండె మావితోట గుభాళింపులో
అల్లనల్లన అనుభవమవుతున్న ఆహ్లాదంలో
పెదవి పలుకుతున్న పదాల నర్తన
చిలిపికన్నుల నవ్వై
మోయలేని హాయిని పంచుతుంది

మాఘమాసపు వేకువెంత వెచ్చనో
మంచుబిందువులు తేనెచుక్కలైన తీపిలో
ఆనందం కోసం దోసిలి పడితే
ఆకాశమే దిగివచ్చి అరచేతిలో వాలింది..😊

కవితత్వాలు


ఆంధ్రభూమి


//నాలో రాగం నాకే తెలుసు//

మొన్నటి నిశీధి రేఖల్లో వెతుక్కున్న
నెలవంకలు నేడు చంద్రకిరణాలుగా మారి
రేయిని హాయిగా మార్చినప్పుడు
ఎదురు చూడకుండానే కురుస్తున్న వెన్నెలను అడగాలనుకున్నా
చడీ చప్పుడూ లేకుండా
అంతాహ్లాదంగా ఎలా జారుతావని..

వేలరంగుల సీతాకోకలొక్కసరి ఎగిరినట్లు
మనోవీధిలో భావాలు అల్లిబిల్లిగా
సందడి చేస్తున్నందుకు
అక్కడంతా మనసు పరిమళమిప్పుడు

పూలగంథాలకోసం తడుముకోనప్పుడు
బుగ్గలూరి నన్నుక్కిరిబిక్కిరి చేసిన
ఆనందానికి పరవశమని పేరందుకేనేమో

నే లయమవుతున్న లోకంలో
ఉలికదలికల ఊహల్లో
నాలో రాగాలు నాకే తెలుసు
అందుకే ఇప్పుడో స్వాతిశయాన్ని పాడుకుంటున్నా
మరో వేకువను మెత్తగా హత్తుకొనేందుకు..!!

ఆంధ్రప్రభ


గోదావరి పత్రిక

అదే..☺️

జివ్వుమంటూ లాగే నరాల ఉద్రిక్తతలో
గాభరాగా తిరిగే గతం మడువులా
ఉలిక్కిపడేంత క్రౌర్యంగా ఉండదది..

ముళ్ళుంటాయని తెలిసిన కలల దారిలో
గులాబీల పరిమళాన్ని
అనుసరిస్తూ పోయేందుకు
మార్గాన్ని సుగమం చేస్తుందది..

ఊసుపోని మాటల అహంకారంలో
అంతులేని రహస్యాలను
శూన్యానికి పురిగొలిపే
అంధకారంలా ఉండదది..

శాంతి పావురపు తెల్లని రెక్కలతో
స్వేచ్ఛను విస్తరింపజేసే
భావాల కదలికల కిరణాల
మెరుపు కల్పనై చైతన్యమిస్తుందది;;

అదే..జ్ఞాపకమంటే..
నిన్నటి ఊపిరిలోని పరిమళాన్ని..
నేటి శ్వాసలోకి అవలోకించగలగడం
పేరులేని పువ్వుల్లోని సున్నితత్వాన్ని
ఊహాతీత సృష్టిలోని సౌందర్యాన్ని
చూపుతో మొదలెట్టి హృదయంలోనికి ఆహ్వానించడం
నిశ్శబ్దాన్ని మౌనానికి మార్చి సరికొత్త స్వరంలోనికి మార్చుకోవడం..💜

గోదావరి పత్రిక


గోదావరి పత్రిక

నాకు తెలిసిన నాన్న..

నాన్నందుకే వెనుకబడ్డాడు..
క్రమశిక్షణ పేరుతో క్రమం తప్పక
బిడ్డల్ని అదిలించి దూరం పెట్టాడు

నవమాసాలు మోసేందుకు కారణమై కూడా
అవకాశమున్నప్పుడల్లా.. వారిని సరిగా పెంచలేదని
ఆమెనొక్కదాన్నే దోషిని చేసి అవమానించాడు

కష్టపడేది కుటుంబం కోసమంటూనే
రోజువారీ ఖర్చులకి పద్దులు రాసి
పదిసార్లు పొలమారేలా కన్నీళ్ళు రప్పించాడు

ఇద్దరూ సమానమంటూనే ఆపిల్లని
కొంచం తక్కువ సమానంగా చూసాడు
'ఆడకూతురే'గానని కలల్ని విరిచాడు

ఎప్పుడూ నవ్వుతూంటే నగుబాటు తప్పదని
పెద్దరికం మాటున సున్నితత్వాన్ని దాచేసి
అనంతమైన దుఃఖాన్ని అలవాటు చేసాడు

అవును..వెనుకబడ్డాడు..
అమ్మని తన సగమని భావించని నాన్న వెనుకే ఉన్నాడు
ఆమె అడుగులకి హద్దుగీస్తూ నిలబడిపోయాడు

తనూ ఓ నాన్నకి కొడుకునని మరిచిన నాన్న
తానూ గరుకు కవచాన్ని ధరించి
కురచయ్యానని గాయపడ్డాడు

అయినా పిచ్చిగానీ..
ఆయన ఎక్కడ ఎప్పుడు వెనకబడ్డాడు..ప్రతి తరంలోనూ..
ఎప్పుడూ ముందే..వెనక్కు తగ్గనంత ఎత్తుగా ఉన్నాడు..
కుటుంబ శ్రేయస్సే ఆయన ఆరాటమైతే
ఆ పోరాటంలో వ్యక్తిత్వం కోల్పోతున్న పిల్లలెందరో
అందుకే..తల్లిదండ్రుల ప్రేమను ప్రోత్సాహాన్ని సమంగా అందుకున్నవారే జీవితంలో విజేతలెప్పటికీ !!

Monday, May 4, 2020

Focus 9 India



ఇలానే నేనుంటా..
కొన్ని అడుగులేసిన అనుభవంతోనే చెప్తున్నా
అశాంతి మొదలయ్యే మలుపేదో అక్కడ నడక తడబడుతుంది
కలని తెలిసినా..
నాకు నేనుగా నిర్మించుకున్న ఊహ..
నిత్యమూ రేయికని ఎదురుచూసి చీకటి పరిష్వంగానికి చేర్చినప్పుడు
ఓ నిశ్చింత జన్మజన్మల పులకింతలా చేరదీస్తుంది.
మెత్తగా తాకే ఓ చూపు..నా నవ్వులతో ముడిపడి
జీవితపు నిడివిని పెంచి అంతర్లోకపు వైశాల్యాన్ని అధిగమిస్తుంది..
ఎడారిలో ముత్యాలు పండవని తెలిసినా..
నేలరాలే నక్షత్రానికీ ఓ గమ్యం ఉంటుందని తెలుసు కనుక
కాస్త దూరమైనా చందమామతోనే మాటలు కలుపుతూ ఉంటానలా..
అపరిచిత ప్రేమను సహించగలిగే నేను
పరిచిత గాయాన్నింక మచ్చిక చేయలేనని తెలుసుకున్నాక
శిశిరంలో చలిమంటకోసం ఆశపడక..వసంతంలో మొలకెత్తేందుకే సమాయత్తమవుతాను
నిజమే..
కిటికీ లోంచీ కనిపించేదే మన లోకమని.. భ్రమ తప్పించి చూడగలిగితే
అనంత విశాలమైన ఆకాశం నీలమై నిఖిలమవుతుంది
ఇప్పుడు రెక్కలు మొలిస్తే ఎగిరేందుకు నే సిద్ధపడినా ఆపేదెవరని..
ఇలానే నేనుంటా..
పడమటిసంధ్య పచ్చని స్మృతిలా నేనుంటా
రాధామనోహరపు మెత్తని పరిమళాన్ని పలవరించేవారికి మాత్రమే నేనో అనుభూతినవుతా..!!


Maalika Web Magazine

"గోరంత గుండెచప్పుడు పదాలుగా మారితే ఆయన కవితైనట్టు.."
చైత్రపు తొట్టితొలి పండుగ ఉగాది మొదలు మాఘమాసపు శివరాత్రి వరకూ ఏటా పన్నెండు పండుగలకో లెక్కుంటే, తను రాసే రెండు..రెండున్నర నెల్లాళ్ళూ పండుగే అభిమానులకి అంటే అతిశయోక్తి కాదు. "పెరిగీ తరిగేను నెలరాజు..వెలుగును నీ మోము ప్రతిరోజూ..ప్రతిరేయి పున్నమిలే..నీతో ఉంటే" అని C. నారాయణరెడ్డి గారు అన్న సందర్భం ఏదయినా గానీ ప్రతి రోజూ.. రాత్రి ముగిసే ముందు ఆయన కవితా చంద్రోదయం కావలసిందే..ఆ వెన్నెల ఆస్వాదించి గానీ రెప్పలు మూతబడవు వారి నేస్తాలకు. మనసు మేఘమై సంచరిస్తూ ఆకాశమంతా కలిదిరగాలంటే..సంతోషాన్ని మించిన రసానుభూతి కావాలి కనుక కొన్ని క్షణాల ఆత్మసమర్పణ కోసమని ఆన్ని ఎదురుచూపులేమో..
నిరంతం సముద్రాన్ని స్నేహిస్తూ తనివితీరా అలల్ని హత్తుకున్నందుకేమో, ఎంత గంభీరంగా రాసిన కవితలైనా కూడా కొంత సంగీతాన్ని వినిపిస్తాయి. ఇది మరెవరికీ లేని ప్రత్యేకమైన తన'లోని' స్వరానిది. అయితే.. ద్వేషాన్ని పంచడం తెలీని తను తిరస్కారాన్ని మాత్రం యధావిధిగా వెనక్కి ఇచ్చేస్తారు. భావుకత్వానికి బంధువో, వాలంటైనుడి వారసుడో, ప్రేమలోకపు రాయబారి కావచ్చునో.. ఎప్పుడూ మృదువైన వాత్సల్యాన్ని వెంటబెట్టుకు తిరుగుతూనో, అవధుల్లేని ఆనందాన్ని పంచుతూనో, సహజమైన ప్రేమ సువాసనలు వెదజల్లుతూనో, హృదయాలకు దగ్గరగా మసులుతూనే ఉన్నట్టుండే సార్ధక నామధేయులు శ్రీ "రాజు"గారు. ఇంతకు మునుపు ఎన్నో రంగురంగుల కలలొచ్చి, ఉదయానికి గుర్తురాని కలతొకటి ఉండి ఉండవచ్చు. కలలేని ప్రశాంత నిద్ర, కమనీయ లాలిత్యమూ తన పదాల పోహణింపులో నిత్యకృత్యము. తన కవిత్వంలో.. కనిపించే ప్రతి విషయమూ కళాకృతిలా కన్నులముందు అందంగా నిలబడి తీరుతుంది. ఆ రాతల్లో ఎన్ని భావాలంకారాలో చేయి తిరిగిన చిత్రకారుని కుంచె స్ఫురణకొస్తుందంటే అతిశయోక్తి లేదు. గులాబీల గుండెలు పిండితీసే అత్తరుని సైతం తిరస్కరించే సున్నితత్వం ఆయన సొంతమనిపిస్తుంది.
చలం ఆరాధకుడ్ని అని చెప్పుకొనే తను ప్రేమను ఎంతగా ఉపాసించి సున్నితంగా రాస్తారో, సామాజిక సమస్యలను, వ్యక్తిగత ఆలోచన ఇతివృత్తాలను, అర్ధాలు కోల్పోతున్న భావాలను సూటి బాణాలుగా ఎక్కుపెట్టేస్తారు. ముఖ్యంగా స్త్రీల పట్ల sensibleగా ఉంటూ ధైర్యాన్ని నేర్పిస్తారు. ఎంతోమంది, ఎక్కడోచోట ఆయన కవిత్వంలో తమని తాము చూసుకోకుండా ఉండరు. బహుశా Emotional Immunity Systemని ఆయన వాక్యాలతోనే పెంచుకుంటారు కాబోలు. ఇంతమందిని ఆదమరిచేలా చేసే ఈయన కవిత్వం ఓ వ్యసనమందుకే..😁
"అశాశ్వతమైన జీవితానికి నీ ప్రేమ తప్ప
వేరే ఏ విలువా - అర్ధం లేకపోవడానికి మించి
ధన్యతేముంటుంది.." ఇంత లోతైన భావ వ్యక్తీకరణ చేయగలిగేదెవ్వరూ..
"ఎప్పుడైనా .,
లోకం తృణీకరించినపుడో
సంఘం నిరాదరించినపుడో
అక్షరాన్ని కావలించుకోగలిగిన వాడే కవి .,
భావంతో రమించగలిగినవాడే తాత్వికుడని
నీకూ చెప్పాలా ...? " ఒక కవి గురించి ఇంత చిన్న వాక్యాల్లో ఇమిడించగలవారు లేరు..
"ఎవరి రాక
నీ జీవితాన్ని తేలిక పరిచిందో..
ఎవరు
నీదన్న ప్రతీదీ మనదిగా భావిస్తారో..
ఎవరు
కలలో కూడా దాపరికమే అవసరం రాని
స్వేచ్ఛాఉనికిగా నీలోపల వశిస్తారో
తనతోనే నువ్వు ప్రేమలో ఉన్నట్టు
తను మాత్రమే నీకు ప్రేమను అందిస్తున్నట్టు.." అంటూ గిలిపెట్టినా..
"ఎవరో కోసేస్తున్నారని
పూలను పుష్పించకుండా ఆపడం మొక్కకి చేత కానట్టే
పడ్డ కోతలకి భారమైన నా జీవితం
నా ప్రేమించే హృదయాన్ని నిరోధించలేదు" అంటూ మెలిపెట్టినా ఆయన తరువాతే..
"ఎప్పుడు
స్త్రీపురుషులు వేరువేరు జీవులుకారని
ప్రకృతి తన కొనసాగింపు ఎత్తుగడలో ఎంచుకున్న
ఒకే దేహానికి రెండు తీరాలని తెలుసుకుంటాడో..
అప్పుడే మనిషి మనిషిగా పరిణామం చెందినట్టు.." ఓహ్..కలని కవిత్వం చేస్తే బంగారులోకం కళ్ళబడుతున్నట్లు...
చదివేందుకు మనసుల్ని మించిన పుస్తకమే లేదన్నట్టు ఆయన రాసే ప్రతీ భావమూ అన్వయయించుకో తగిన రహస్యానుభూతే శృతి తెలిసినవారికి..
ఉన్నచోటునే ఉంటూ ఒకొక్కరి హృదయాల్లోకి వలసపోతూ, తన అస్తిత్వాన్ని అక్షరాలుగా అల్లుకుపోతుంటారు. అందుకే అందరివాడైన మకుటం లేని "మహరాజే".. ఈ రాజు..💜
మరింత చిక్కని కవిత్వం రాసి, మరిన్ని హృదయాలు గెలిచి మీ కవిత్వాన్ని సంపుటీకరించాలని ఆశిస్తూ..మరోసారి హృదయపూర్వక అభినందనలు