Thursday, April 9, 2020

Humour toons publish

My poem in Humour Toons Magazine ..😊

లేమంచు గిలిగింత..

చిరుగాలేం చిలిపిపని చేసిందనో..
ఆకులు నవ్వుతున్న చప్పుడుకి మెలకువొచ్చింది
ఇంతసేపు లేని పరిమళమేదో గుప్పున తాకినట్టు
ఈ వేకువ ఒక్కసారిగా మత్తుచల్లింది

పూలగంధానికి పుట్టిన మోహానికేమో
ఆహ్లాదం అణువణువునా చీరలా నన్ను చుట్టుకుంది
సగం కలలోంచీ విచ్చుకున్న కన్నులు అరమోడ్పులైతే
పెదవొంపు ఒయ్యారానికి సొగసైన పేరేం పెట్టాలో..

ముద్దులొలికే మైమరపురాగం మౌనమైతే
మనసు మోజు దీర్ఘ శ్వాసలో కలిసినట్టు
సుప్తావస్థ ధ్యానం క్షణాలను ఆపేందుకు
అనుభూతిని ఆసరా అడుగుతోందిప్పుడు

సముద్రపు అలల ముత్యాలగుంపు
గుట్టుగా గుసగుసలు మొదలుపెట్టినట్టు
అనువదించలేని దృశ్యాలెన్నో కన్నులముందు
హేమంతమంతా పండుగైనట్టు లేమంచు గిలిగింతతో 💜